ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన పెన్సిల్వేనియా న్యాయమూర్తి

  • అక్రమ ఓట్లు లెక్కించవద్దంటూ కోర్టుల్లో ట్రంప్ పిటిషన్లు
  • ఆరోపణలకు తగిన ఆధారాల్లేవన్న పెన్సిల్వేనియా కోర్టు
  • సాక్ష్యాలు సమర్పించేందుకు తగిన సమయం ఇవ్వలేదన్న ట్రంప్ బృందం
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవద్దంటూ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వేసిన పిటిషన్ ను పెన్సిల్వేనియా డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. అక్రమ ఓట్లు అంటూ ట్రంప్, ఆయన బృందం చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు భావించింది. ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించవచ్చని అధికారులకు నిర్దేశించింది. ట్రంప్, ఆయన బృందం కేవలం ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నట్టు భావిస్తున్నామని న్యాయమూర్తి మాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు.

పెన్సిల్వేనియా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పుపై ట్రంప్ బృందం స్పందించింది. తమ ఆరోపణలు నిరూపించుకునేందుకు, వాటికి అవసరమైన సాక్ష్యాలను సమర్పించేందుకు న్యాయస్థానం తగిన అవకాశం ఇవ్వకుండానే పిటిషన్ తిరస్కరించిందని, కోర్టు నిర్ణయం విచారకరమని పేర్కొంది. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ బృందం వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ఇప్పటికీ తనదే గెలుపు అని ట్రంప్ పేర్కొంటుండడం తెలిసిందే.


More Telugu News