షష్టిపూర్తి వయసులోనూ నవయవ్వనం... ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ఆసక్తికర పరిశోధన

  • వృద్ధులను ఆక్సిజన్ చాంబర్లలో ఉంచి అధ్యయనం
  • పుంజుకున్న టెలోమెర్లు
  • తగ్గిన పిశాచ కణాలు
ప్రాణుల్లో వయసుతోపాటే వార్ధక్యం కూడా వస్తుంది. మనిషి కూడా అందుకు మినహాయింపు కాదు. వృద్ధాప్యంతో వంగిపోయిన శరీరం ఏ పనికీ సహకరించక పెద్దవయసు వ్యక్తులు ఎన్నో బాధలు పడతుంటారు. వయసుతో పాటు ఆరోగ్యం కూడా క్రమేపీ సన్నగిల్లుతుంటుంది. ఇది సహజమైన విషయమే. సృష్టి ధర్మం కూడా. అయితే, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సృష్టికి ప్రతిసృష్టి చేస్తామంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల యువతలా నిత్య యవ్వనంతో ఉల్లాసంగా గడపొచ్చని అంటున్నారు. ఎలాంటి కాలుష్యంలేని, అత్యంత స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చితే ఇది సాధ్యమేనని చెబుతున్నారు.

ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అంశంపై 3 నెలలు ప్రయోగాలు చేశారు. 64 ఏళ్లకు పైబడిన 35 మంది వృద్ధులను ప్రతివారం ఐదు రోజుల పాటు, రోజుకు గంటన్నర సేపు ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ చాంబర్లలో ఉంచారు. ఈ చాంబర్లలో ఆక్సిజన్ ప్రవాహం తక్కువగా ఉండేలా చేసి వారికి మాస్కుల ద్వారా ప్రాణవాయువు అందించారు. ఈ విధంగా 3 మూడు నెలల పాటు అధ్యయనం చేశారు. అనంతరం ఆ వృద్ధుల్లో కీలకమైన టెలోమెర్లు 20 శాతం పెరిగినట్టు గుర్తించారు.

మానవుల్లో క్రోమోజోమ్ లు ఉంటాయని తెలిసిందే. ఈ క్రోమోజోమ్ ల పరిమాణం క్షీణించకుండా వాటి చివర్లకు నాలుగు వైపులా టెలోమెర్లు ఉంటాయి. ఇక మనిషి వయసు పెరిగే కొద్దీ ఈ టెలోమెర్లు కూడా బలహీనపడుతుంటాయి. వాటి పరిమాణంలోనూ మార్పు వస్తుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ చాంబర్లలో వృద్ధులను ఉంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడంతో టెలోమెర్లు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి. వారు పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అదే రీతిలో పునరుజ్జీవం పొందాయి. వృద్ధాప్యాన్ని అరికట్టడంలో ఇదో కీలక పరిణామం అని టెల్ అవీవ్ వర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు, మానవదేహంలో ఉండే సెనెసెంట్ కణాలు (పిశాచ కణాలు)కూడా తగ్గుముఖం పట్టాయట. ఈ సెనెసెంట్ కణాలు నేరుగా ఎలాంటి హాని చేయకపోయినా, వీటి చుట్టుపక్కల ఉండే కణాలపై ప్రమాదకర రసాయనాలు విడుదల చేసి వాటికి నష్టం చేకూరుస్తాయి. దాంతో అల్జీమర్స్ (మతిమరపు), పార్కిన్సన్ వ్యాధి (వణుకు), డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు, ధమనుల్లో కొవ్వు అడ్డంపడడం, హృద్రోగాలు, ఎముకలు బలహీనపడడం (ఆస్టియోపొరోసిస్), కళ్లలో శుక్లాలు (కేటరాక్ట్) వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. తాజా పరిశోధనలో ఈ సెనెసెంట్ కణాలు కూడా 37 శాతం క్షీణించాయి. తద్వారా ఇతర కణాలు ఆరోగ్యవంతమయ్యాయని గుర్తించారు.


More Telugu News