ట్రంప్ ఒప్పుకోకున్నా... జనవరి 20న 'ఎట్ పోటస్' బైడెన్ కు అప్పగిస్తామన్న ట్విట్టర్!

  • యూఎస్ ప్రెసిడెంట్ అధీనంలో ఎట్ పోటస్
  • ఇతర ఖాతాలూ జనవరి 20న చేతులు మారతాయి
  • వెల్లడించిన ట్విట్టర్
జనవరి 20న అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతాను జో బైడెన్ కు అప్పగిస్తామని ట్విట్టర్ కీలక ప్రకటన చేసింది. యూఎస్ ప్రెసిడెంట్ పేరిట 'ఎట్ పోటస్' (@POTUS) అనే ట్విట్టర్ ఖాతా ఉందన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం 3.2 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోకున్నా, ఆ ఖాతాను బైడెన్ కు అందించేందుకు కట్టుబడివున్నట్టు ట్విట్టర్ పేర్కొంది.

ఈ ఖాతాను బైడెన్ కు అప్పగించిన తరువాత, అందులో ఉన్న ట్వీట్లన్నీ ఆర్కైవ్స్ లోకి వెళ్లిపోతాయని కూడా ట్విట్టర్ వెల్లడించింది. ఆ వెంటనే ప్రస్తుతమున్న 'ఎట్ వైట్ హౌస్', 'ఎట్ వీపీ', 'ఎట్ ఫ్లోటస్' తదితర ఇతర అధికారిక ఖాతాలు సైతం జనవరి 20నే చేతులు మారతాయని పేర్కొంది. ఇదిలావుండగా, జార్జియాలో బైడెన్ విజయం సాధించినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటంతో, మరో వారం రోజుల వ్యవధిలోనే బైడెన్ తన క్యాబినెట్ సభ్యుల పేర్లను ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.

కాగా, తన ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించ లేదన్న సంగతి తెలిసిందే. దీంతో అధికార బదిలీకి అవసరమైన ప్రక్రియను జీఎస్ఏ ఇంకా ప్రారంభించలేదు. అధికార మార్పిడికి అవసరమైన 90 లక్షల డాలర్ల నిధులు కూడా ఇంకా విడుదల కాలేదు. జీఎస్ఏ విభాగం హెడ్ ఎమిలీ మర్ఫీ బైడెన్ గెలుపును గుర్తిస్తే, ఆ తరువాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.



More Telugu News