బల్దియా బరిలో 68 నామినేషన్ల తిరస్కరణ!

  • పూర్తయిన నామినేషన్ల పరిశీలన
  • 1,825 నామినేషన్లు సక్రమమే
  • ముగ్గురు పిల్లలున్నందున కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణ
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 1,893 నామినేషన్లు రాగా, వాటిల్లో 68 నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1,825 మంది నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. గాజులరామారానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ కు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది.

ఇక మాదాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని, పైగా ఆయనకు ముగ్గురు పిల్లలున్నారన్న కారణాలు చెబుతూ, ఆయన నామినేషన్ ను కూడా తిరస్కరించారు. ఈ ఘటనల తరువాత రిటర్నింగ్ అధికారుల కార్యాలయం వద్దకు పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రాగా, పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే ఆయన నామినేషన్ రద్దయిందని అధికారులు స్పష్టం చేశారు.

కాగా, నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుండగా, పలు పార్టీల తరఫున రెబల్స్ గా బరిలో ఉన్నవారిని బుజ్జగించేందుకు పెద్ద నేతలు రంగంలోకి దిగారు. దీంతో నేడు చాలా మంది తమ అభ్యర్థిత్వాలను వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపసంహరణ పూర్తయిన తరువాతనే, ఎన్నికల బరిలో ఎంతమంది మిగులుతారన్న విషయం తేలుతుంది.



More Telugu News