సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామని బెదిరింపు.. ఇద్దరిపై కేసు నమోదు

  • పార్కులో పరిచయమైన వ్యక్తిని నమ్మి రూ. 30 లక్షలు ఇచ్చిన శ్రీనివాస్
  • మూడు నెలల్లో ఇస్తామంటూ సంవత్సరాలు గడిపేసిన వైనం
  • డబ్బులు అడిగితే బెదిరింపులు
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌కు చెందిన వందేమాతరం శ్రీనివాస్ అలియాస్ కె.శ్రీనివాస్‌రావు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సమయంలో కేబీఆర్ పార్క్‌లో ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి సమీపంలో నివసించే తిరుపతయ్యతో పరిచయం ఏర్పడింది.

పరిచయం క్రమంగా స్నేహానికి దారితీసింది. ఈ క్రమంలో 2018లో కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన కాంట్రాక్టర్ అయిన తన మామయ్య రంగస్వామితో కలిసి శ్రీనివాస్‌ను తిరుపతయ్య కలిశాడు. ఈ సందర్భంగా వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నానని, తనకో రూ. 30 లక్షలు ఇస్తే మూడు, నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. వారిని నమ్మిన శ్రీనివాస్ పలు దఫాలుగా  రూ. 30 లక్షలు ఇచ్చారు.

మూడు నాలుగు నెలల్లో తిరిగి వెనక్కి ఇచ్చేస్తామన్న తిరుపతయ్య, రంగస్వామిలు నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ మాయమాటలు చెబుతూ వస్తున్నారు. దీంతో నెల రోజుల క్రితం తన స్నేహితుడైన మధుసూదన్‌రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ డబ్బుల కోసం అడిగాడు. దీంతో చంపేస్తానంటూ శ్రీనివాస్‌ను తిరుపతయ్య బెదిరించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, రంగస్వామిలపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News