పాకిస్థాన్ అభ్యర్థనకు ఫ్రాన్స్ తిరస్కరణ

  • పాతబడిన యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయాలని కోరిన పాక్
  • కుదరదన్న ఫ్రాన్స్
  • భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలకే ప్రాధాన్యం
తమ వద్ద ఉన్న పాత మిరేజ్ యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అగస్టా 90బి క్లాస్ జలాంతర్గాములను ఆధునికీకరించాలన్న పాకిస్థాన్ అభ్యర్థనను ఫ్రాన్స్ తిరస్కరించింది. పాక్ వద్ద ప్రస్తుతం 150 వరకు మిరేజ్ విమానాలున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ అయిన డసాల్ట్ వీటిని తయారు చేసింది. వీటిలో దాదాపు సగం విమానాలు సర్వీస్‌ స్థితికి చేరుకున్నాయి.

వీటితోపాటు ఫ్రెంచ్-ఇటాలియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అగస్టా 90బి జలాంతర్గాములను ఆధునికీకరించాలంటూ ఫ్రాన్స్‌ను అభ్యర్థించింది. అయితే, ఆ అభ్యర్థనను ఫ్రాన్స్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలున్న ఫ్రాన్స్, పాక్ అభ్యర్థనను తిరస్కరించడం ఆ దేశానికి పెద్ద దెబ్బే కానుంది.

ఫ్రాన్స్‌లో ఇటీవల స్కూలులో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు మహ్మద్ ప్రవక్తపై వచ్చిన ఓ కార్టూన్‌ను చూపించాడు. ఇది తెలుసుకుని ఆగ్రహానికి గురైన ఓ ముస్లిం వ్యక్తి సదరు ఉపాధ్యాయుడుని హత్య చేశాడు. అనంతరం హత్యకు గురైన ఉపాధ్యాయుడికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ నివాళులర్పిస్తూ, అతని చర్యను సమర్థించారు. మతాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉందన్నారు. దీంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలు దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మేక్రాన్ వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్.. ముస్లిం దేశాధినేతలకు లేఖ రాస్తూ మేక్రాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు, ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. భారతదేశ భద్రతాపరమైన అంశాలపట్ల తాము సున్నితంగా వ్యవహరిస్తామని ఫ్రాన్స్ హామీ ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్థాన్‌కు చెందిన టెక్నీషియన్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న ఫ్రాన్స్.. పాక్ అభ్యర్థనను తిరస్కరించడం ద్వారా ఆ దేశానికి దూరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.


More Telugu News