ఈసారి ఎన్నికల్లో సెంచరీ కొట్టడం ఖాయం: కేటీఆర్

  • గతంలో ఒక రన్ తేడాతో సెంచరీ మిస్ అయ్యాం
  • ఈ సారి 105 నుంచి 110 స్థానాలను సాధిస్తాం
  • 10 రోజుల పాటు నిర్విరామంగా పని చేయాలి
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ మిస్ అయిందని... ఈ సారి సెంచరీ కొట్టడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్క రన్ తేడాతో గతంలో సెంచరీ మిస్ అయ్యామని చెప్పారు. జాంభాగ్ లో కేవలం 5 ఓట్ల తేడాతో ఓడిపోయామని తెలిపారు. ఈసారి 105 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారంతా టికెట్ల కోసం పోటీపడిన వారిని కలవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలను తప్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత హైదరాబాద్ లో ఎలాంటి లొల్లి లేదని చెప్పారు. నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. హైదరాబాదుకు పెట్టుబడులు ఎలా వస్తున్నాయని ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూడా ఆరా తీశారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను అభ్యర్థులు కలిసి వారి మద్దతు కోరాలని కేటీఆర్ సూచించారు. రానున్న 10 రోజులు 24 గంటలపాటు అలుపెరగకుండా నిర్విరామంగా పని చేయాలని చెప్పారు.


More Telugu News