సెహ్వాగ్ తనను 'రూ.10 కోట్ల చీర్ లీడర్' అనడంపై స్పందించిన ఆసీస్ ఆల్ రౌండర్

  • ఐపీఎల్ 2020లో గ్లెన్ మ్యాక్స్ ఘోర వైఫల్యం
  • 13 మ్యాచ్ లలో 108 పరుగులు
  • కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టని మ్యాక్స్ వెల్
గతంలో అనేక పర్యాయాలు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్ లు ఆడి కేవలం 108 పరుగులు చేశాడు. అతని సగటు చూస్తే 15.42. భారీ షాట్లకు పెట్టిందిపేరైన మ్యాక్స్ వెల్ ఐపీఎల్ తాజా సీజన్ లో కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో విమర్శించాడు.

'రూ.10 కోట్ల చీర్ లీడర్' అంటూ మ్యాక్స్ వెల్ పై వ్యంగ్యం ప్రదర్శించాడు. ఐపీఎల్ కోసం రూ.10 కోట్లు తీసుకుంటూ ఇతరుల ప్రదర్శనలకు చప్పట్లు కొట్టేవాడిగా మిగిలిపోయాడన్న కోణంలో వీరూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఐపీఎల్ కు వేదికగా నిలిచిన యూఏఈలో మ్యాక్స్ వెల్ ప్రస్థానాన్ని 'అత్యంత ఖరీదైన విహారయాత్ర'గా అభివర్ణించాడు. దీనిపై మ్యాక్స్ వెల్ స్పందించాడు. తానంటే నచ్చకపోవడంతోనే వీరూ ఇలా మాట్లాడి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.

అందుకు తానేమీ అభ్యంతరపెట్టబోనని, తాను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వీరూ అది మాట్లాడొచ్చని పేర్కొన్నాడు. "ప్రస్తుతం అతను మీడియాలో ఉన్నాడు... ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే ఎలా! నేను మాత్రం అతని వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదు. ఆ వ్యాఖ్యలను తేలిగ్గానే తీసుకుంటున్నా. ఇలాంటి పరిణామాలను, స్పందనలను తగినరీతిలో స్వీకరించగల పరిణతి నాకుంది. ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు గతంలో ఎంతో శ్రమించా. ఈ సంవత్సరం నాకు కఠినపరీక్షగానే భావిస్తాను" అని తెలిపాడు.

ఆరోగ్యపరమైన కారణాలతో క్రికెట్ నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఈ కుడిచేతివాటం ఆటగాడు విరామ సమయంలో సమస్యలను చక్కదిద్దుకోవడం ఎలాగో నేర్చుకున్నానని తెలిపాడు.


More Telugu News