దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తున్నాం: బొత్స

  • కరోనాతో మరణించిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్
  • దివంగత ఎంపీ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ నిర్ణయం
  • బల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులతో చర్చలు
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనాతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దివంగత ఎంపీ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నామని వెల్లడించారు. బల్లి దుర్గాప్రసాద్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

అయితే, తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలో నిలపాలన్నదానిపై బల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులతో సీఎం జగన్ చర్చించారని, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని బొత్స చెప్పారు. ఈ మేరకు దివంగత ఎంపీ కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

మరోపక్క, తిరుపతి ఎంపీ స్థానానికి వైసీపీ తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని పోటీలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ గా గుర్తింపు ఉన్న డాక్టర్ గురుమూర్తి నాడు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ వెంట ఉన్నారు. అప్పట్లో జగన్ కాళ్లకు కట్లు కడుతున్న గురుమూర్తి ఫొటోలు వైరల్ అయ్యాయి.


More Telugu News