భారత్ పట్ల చైనా కుట్రపూరిత వైఖరిని బహిర్గతం చేసిన అమెరికా విదేశాంగ నివేదిక

  • భారత్ ఎదుగుదలను చైనా ఓర్వలేకపోతుందని వెల్లడి
  • భారత వ్యూహాత్మక సంబంధాల తెంచివేతకు యత్నాలు
  • కరోనా వ్యాప్తికి చైనాయే కారణమని పునరుద్ఘాటన
కొన్నాళ్ల కిందట తిరుగులేని ఉత్పాదకతతో ప్రపంచ వాణిజ్య రంగాన్ని శాసించే దిశగా పయనించిన చైనా ఇప్పుడు అనేక దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. సామ్రాజ్యవాదం, వాణిజ్య ఆధిపత్యం, స్వార్థ ప్రయోజనాలు, దురాశ... ఇలా చైనాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విభాగం తన నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. భారత్ వేగంగా ఎదుగుతుండడం పట్ల చైనా ఓర్వలేకపోతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

భారత్ అభివృద్ధి చెందితే తన లక్ష్యాలు నెరవేరవని చైనా భయపడుతోందని, భారత్ అభ్యున్నతి తనకు ఇబ్బందికరంగా మారుతున్నట్టు చైనా భావిస్తోందని వివరించారు. ఇటీవలకాలంలో భారత్... అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భాగస్వామ్యాలను మరింత విస్తరించుకుంటుండగా, ఆ వ్యూహాత్మక భాగస్వామ్యాలను తుంచివేయాలని చైనా పన్నాగాలకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ విభాగం వెల్లడించింది.

ప్రధానంగా, భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడి తాను ప్రయోజనం పొందాలని చూస్తోందని తెలిపింది. తైవాన్ విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తూ బలవంతపు విలీనం కోసం ప్రయత్నిస్తోందని పేర్కొంది. అదే సమయంలో ఆసియాలో అమెరికా పట్టును తగ్గించి, తన హవా సాగించాలని చైనా వ్యూహరచన చేస్తోందని తెలిపింది. అంతేకాదు, చైనా నిర్లక్ష్యమే వుహాన్ లో కరోనా వైరస్ పుట్టుకకు కారణమని ఆరోపించింది. కరోనా రక్కసి ప్రపంచమంతా వ్యాపించడానికి చైనాయే కారణమని మండిపడింది.


More Telugu News