పెరుగుతున్న కరోనా కేసులు.. అహ్మదాబాద్ లో రాత్రి పూట కర్ఫ్యూ విధింపు

  • రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
  • పండుగల వల్ల కరోనా కేసులు పెరిగాయన్న అధికారులు
  • ఆసుపత్రుల్లో కావాల్సినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయని వ్యాఖ్య
దేశంలో పలు చోట్ల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గుజరాత్ లో పెద్ద నగరమైన అహ్మదాబాద్ లో కూడా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఓ వైపు పెరుగుతున్న చలి కూడా కరోనా పెరగడానికి కారణమవుతోందని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటి వరకు అహ్మదాబాద్ లో 46,022 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. పండుగల వల్ల కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. నగరంలోని ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయని తెలిపారు. 40 శాతం బెడ్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ గుప్తా చెప్పారు. అహ్మదాబాద్ కోవిడ్-19 స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా ఈయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

గత 24 గంటల్లో ఇండియాలో కరోనా కేసుల విస్తరణ 18 శాతం పెరిగింది. మన దేశంలో నమోదైన కేసుల సంఖ్య 90 లక్షలకు చేరుకుంటోంది.


More Telugu News