చంద్రబాబు, జగన్ పాలనలో ఎమ్మెల్యేల మధ్య తేడా లేదు... అందరూ అందరే: సోము వీర్రాజు

  • టీడీపీ, వైసీపీ నేతలపై సోము వీర్రాజు ధ్వజం
  • ఎలుకల్లా దోచుకుంటున్నారని విమర్శలు
  • కేంద్ర నిధులు వాడుకుంటూ మోదీ ఫొటో వేయడంలేదని ఆరోపణ
అన్యాయం, అవినీతి ఎప్పుడు జరిగినా తాను ప్రశ్నిస్తూనే ఉన్నానని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో నీరు-చెట్టు కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే ఎలుగెత్తానని, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో అక్రమాలు పేరిట కొండలను తవ్వేస్తున్న సమయంలోనూ స్పందిస్తున్నానని వివరించారు. గతంలోనూ ఉపాధి పనుల్లో ఎమ్మెల్యేలు దోచుకున్నారని, ఇప్పటి ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా ఎలుకల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఇళ్ల స్థలాల చదును కోసం రూ.3,000 కోట్లు ఇస్తే ఎమ్మెల్యేలు కొండను తవ్వుకుని నిధులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.12 వేల కోట్లతో పనులు చేస్తున్నారని, అది కూడా ఉపాధి హామీ అనుసంధానంగా కేంద్ర నిధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద హెల్త్ సెంటర్లకు భారీగా నిధులు ఇస్తోందని వీటిని కూడా ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

ఇన్ని వేల కోట్లను కేంద్రం ఇస్తున్నా ఎక్కడా ప్రధాని మోదీ ఫొటో మాత్రం వేయరని, ఈ అంశంలో చంద్రబాబుకు, జగన్ కు పెద్ద తేడా లేదని విమర్శించారు. 104 వాహనాలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయని, కానీ వాటిపై జగన్ ఫొటో ఉంటుందని వివరించారు. చిరునవ్వులు చిందిస్తున్న సీఎం ఫొటో బదులు ప్రధాని మోదీ ఫొటో వేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. గతంలో చంద్రన్న బాట అని పేరుపెట్టారని, ఏం, మోదీ అన్న అంటూ పేరు పెట్టుకోవచ్చు కదా? అని నిలదీశారు.


More Telugu News