టీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థే మేయర్‌ అవుతారు: జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు

  • టీఆర్‌ఎస్‌ రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి
  • ఇప్పుడు హైదరాబాద్‌లో పటిష్ట శాంతిభద్రతలు
  • దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే
  • మరోసారి గ్రేటర్‌ మేయర్‌ పీఠం మాదే
  • ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.టీఆర్‌ఎస్‌ రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి ఉండేదని, ఇప్పుడు లేదని తెలిపారు.

తెలంగాణ ఏర్పడితే అల్లర్లు జరుగుతాయని విషప్రచారం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రశాంతంగా ఉందని, సీఎం కేసీఆరే అందుకు కారణమని తెలిపారు. టీఆర్‌ఎస్‌ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో పటిష్ట శాంతిభద్రతలున్నాయని, దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. మరోసారి గ్రేటర్‌ మేయర్‌ పీఠం తమదేని తెలిపారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని తెలిపారు.

డిసెంబర్ నాలుగున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌గా కూర్చుంటుందని, తమకు వేరే ఆలోచన లేదని చెప్పారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు.  తాము రూ.2వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీరు అందించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ కొరత ఉండేదని తెలిపారు.

ఏడు మండలాలు, సీలేరు విద్యుత్‌ ప్లాంట్‌ను కేంద్రం ఏపీలో కలిపిందని, అయితే కేసీఆర్‌ ముందుచూపుతో విద్యుత్‌లోటు నుంచి మిగులు విద్యుత్‌కు చేరుకున్నామని తెలిపారు. ఇప్పుడు లక్షలాది మంది కార్మికులకు తగినంత పని దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం తర్వాత ఇక్కడ చెత్త సేకరణ పెరిగిందని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తయ్యే ప్లాంట్ ప్రారంభించామని అన్నారు. మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్‌ ముందుందని తెలిపారు.


More Telugu News