కాంగ్రెస్ పరాభవాలపై చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు

  • ఎన్నికల ఫలితాలు కలవరపరుస్తున్నాయి
  • క్షేత్ర స్థాయిలో కార్యాచరణ లోపించింది
  • బీహార్ లో శక్తికి మించిన స్థానాల్లో పోటీ చేశామనిపిస్తోంది
కాంగ్రెస్ పార్టీ లోపాలపై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వేడి ఇంకా తగ్గక ముందే మరో సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పరాభవానికి కారణం సరైన కార్యాచరణ లోపించడమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ ఒక మాట కూడా అననివ్వని చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కలవరపరుస్తున్నాయని చిదంబరం అన్నారు. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో కార్యాచరణ లోపించడం కానీ లేదా పార్టీ బలహీనపడిపోవడం కానీ కావచ్చని చెప్పారు. బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ... చివరకు ఫలితం తారుమారైందని అన్నారు. ఈ ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బీహార్ లో మన శక్తికి మించి ఎక్కువ స్థానాల్లో పోటీ చేశామనిపిస్తోందని చిదంబరం అన్నారు. 45 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే సరిపోయేదని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, కేరళ ఎన్నికలలో ఏం జరగబోతోందో చూడాలని అన్నారు. పార్టీ అధినేతగా ఎవరుండాలనే విషయంపై తాను మాట్లాడలేనని... అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడొచ్చని చెప్పారు.


More Telugu News