యాపిల్ ఫోన్ కోసం కిడ్నీ అమ్మి.. ఇప్పుడు మంచానికి పరిమితమైన యువకుడు!

  • కిడ్నీని అమ్మేసి యాపిల్ ఐప్యాడ్, ఐఫోన్ 4 కొనుగోలు
  • కిడ్నీ సమస్యలతో మంచానికే పరిమితం
  • ఐదుగురు సర్జన్లు సహా 9 మంది అరెస్ట్
యాపిల్ ఫోన్‌ కొనేందుకు తన కిడ్నీని అమ్మేసిన ఓ యువకుడు ఇప్పుడు మంచానికే పరిమితమై తీవ్ర వేదన అనుభవిస్తున్నాడు. చైనాలో జరిగిందీ ఘటన. యాపిల్ ఫోన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయి. దీంతో ఈ ఫోన్ వారికి కలగానే మిగులుతోంది. అయితే, తన కలను నెరవేర్చుకోవాలనుకున్న చైనాకు చెందిన 17 ఏళ్ల షాంగ్‌కన్ 2011లో ఏకంగా తన కిడ్నీనే అమ్మేసుకున్నాడు. వచ్చిన డబ్బులతో ఎంచక్కా యాపిల్ ఐప్యాడ్, ఐఫోన్ 4 కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకున్నాడు.

అంత వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. శరీరంలో ఒకటే మూత్ర పిండం ఉండడం, అది సరిగా పనిచేయకపోవడంతో నెమ్మదిగా సమస్యలు ప్రారంభమయ్యాయి. కిడ్నీ పనితీరు రోజురోజుకు క్షీణించడంతో అవయవాలు సక్రమంగా పనిచేయడం మానేశాయి. ఫలితంగా ఆసుపత్రిలో చేరాడు.

ప్రస్తుతం డయాలసిస్ స్థితిలో ఉన్న అతడు జీవితాంతం బెడ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఐఫోన్ సరదా తనను మంచానికి పరిమితం చేస్తుందని ఊహించలేకపోయిన షాంగ్‌కన్ ఇప్పుడు రోజులను దీనంగా వెళ్లదీస్తున్నాడు. కాగా, యువకుడి నుంచి కిడ్నీ కొనుగోలు చేసిన ఐదుగురు సర్జన్లు సహా తొమ్మిదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


More Telugu News