20 నుంచి తుంగభద్ర పుష్కరాలు... ముహూర్తంపై ఏకాభిప్రాయం!

  • మధ్యాహ్నం 1.21కి పుష్కరాలు ప్రారంభం
  • కర్నూలు జిల్లాకు వెళ్లనున్న సీఎం జగన్
  • ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు
ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కర ప్రారంభ ముహూర్తం కోసం జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి వచ్చి, విషయాన్ని దేవాదాయ శాఖకు తెలియజేశారు. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు సాగగా, ఈ సంవత్సరం 20 నుంచి డిసెంబర్ 1 వరకూ 12 రోజులు సాగనున్నాయి.

ఇక పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా నదీ స్నానాలకు బదులుగా జల్లు స్నానాలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ భక్తులకు సూచించింది. పితృ దేవతలకు పిండ ప్రదానాదులను నిర్వహించేందుకు 443 మంది పురోహితులను నియమిస్తూ, రేట్లను కూడా దేవాదాయ శాఖ నిర్ధారించింది.

ఈ పుష్కరాల్లో మంత్రాలయం, కర్నూలు ప్రాంతాలకు అధిక తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇక, 20వ తేదీన పుష్కరాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద ఆయన శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని సీఎం అడిషనల్ పీఎస్ తెలియజేశారు.


More Telugu News