ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఏపీ ఎస్ఈసీ

  • న్యాయపరమైన ఇబ్బందుల్లేవన్న ఎస్ఈసీ
  • పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతమైనవని వెల్లడి
  • ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమన్న రమేశ్ కుమార్
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము అన్నివిధాలా సన్నద్ధతతో ఉన్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీలతో చర్చించినట్టు ఎస్ఈసీ తెలిపింది.

పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని వివరించింది. పైగా, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిందని, నిత్యం వేలల్లో వచ్చిన కేసులు ఇప్పుడు వందల్లోనే వస్తున్నాయని ఎస్ఈసీ పేర్కొంది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ  రాజ్యాంగపరమైన అవసరమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో లేదని, నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అన్నారు.


More Telugu News