జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సారి 104 సీట్లు గెలుచుకుంటాం: తలసాని

  • గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది
  • ఈరోజు లేదా రేపు అభ్యర్థులను ప్రకటిస్తాం
  • నగర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసింది
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో... పార్టీలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ఈరోజు లేదా రేపు ప్రకటిస్తామని తెలిపారు. ఈసారి 104 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ప్రధాన నేతలందరూ  ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ది కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలిపారు. కేటీఆర్ విజన్ తో అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు. నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్ల వంటివి ఎన్నో నిర్మించామని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన కృషి ఏమిటో నగర ప్రజలందరికీ తెలుసని... టీఆర్ఎస్ కు వారు పట్టంకడతారని చెప్పారు. టీఆర్ఎస్ పై బుదర చల్లేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని... అయినా, వారి మాటలను ప్రజలు వినరని అన్నారు.


More Telugu News