అలా అయితే గుజరాత్ వెళ్లిపోండి.. బెంగాల్ బీజేపీ చీఫ్‌కు టీఎంసీ కౌంటర్

  • తాము అధికారంలోకి వస్తే బెంగాల్‌ను గుజరాత్‌లా మారుస్తామన్న బీజేపీ
  • అదే జరిగితే ప్రజలు నిత్యం ఎన్‌కౌంటర్ల భయంతో బతకాల్సి వస్తుందన్న టీఎంసీ
  • అక్కడ అదానీ, అంబానీలదే రాజ్యమని విమర్శలు
బెంగాల్‌ రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా, బెంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

ఉత్తర 24 పరగణ జిల్లాలోని బరసాత్‌లో స్థానికులతో ఘోష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాము కనుక అధికారంలోకి వస్తే బెంగాల్‌ను గుజరాత్‌లా మారుస్తామని అన్నారు. తాము ఈ మాటంటే మమత బెనర్జీ విమర్శిస్తున్నారని, కానీ తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ పని చేస్తామని అన్నారు. అప్పుడు తమ పిల్లలు ఉద్యోగాల కోసం గుజరాత్ వెళ్లాల్సిన పని ఉండదన్నారు. అందరికీ ఎంచక్కా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

ఘోష్ వ్యాఖ్యలపై బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోష్ వెంటనే రాష్ట్రాన్ని వదిలేసి గుజరాత్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడాలని డిమాండ్ చేశారు. గుజరాత్ అల్లర్లలో దాదాపు 2 వేల మంది చనిపోయారని పేర్కొన్న ఆయన.. ఇష్రాత్ జహాన్ వంటి ఎందరో ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌లా మారుస్తామని అంటున్నారని, అదే జరిగితే ఇక్కడి ప్రజలు నిత్యం ఎన్‌కౌంటర్ల భయంతో బతకాల్సి వస్తుందని అన్నారు. గుజరాత్‌లో అదానీ, అంబానీ లాంటి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఫలితంగా చిరు వ్యాపారులు చితికిపోయారని హకీం ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలివెళ్లిన నానో కంపెనీని కూడా మూసివేశారని మంత్రి విమర్శించారు.


More Telugu News