'దిశ ఎన్ కౌంటర్' సినిమా విషయంలో రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు

  • దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని ఆపాలంటూ దిశ తండ్రి పిటిషన్
  • విచారణ చేపట్టిన హైకోర్టు
  • కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు, ప్రభుత్వానికి ఆదేశాలు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు. ఆయన ఏ చిత్రం ప్రారంభించినా ఏదో ఒక రూపంలో వివాదాన్ని వెంట తెచ్చుకుంటారు. తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'దిశ ఎన్ కౌంటర్' చిత్రం కూడా ఈ కోవలోకే చేరింది. ఆ చిత్రాన్ని ఆపాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు నిర్ణయం రాకముందే మీరు కోర్టుకు ఎందుకు వచ్చారని దిశ తండ్రిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో దిశ తండ్రి తరఫున ఆయన న్యాయవాది స్పందించారు. సినిమా సెన్సార్ పరిధిలోనే ఉన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సినిమా ట్రైలర్ లు విడుదల చేస్తున్నారని కోర్టుకు వివరించారు. దాంతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మను ఆదేశించింది.

ఈ సినిమాకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకుని తమకు సమాచారం అందించాలంటూ సొలిసిటర్ జనరల్ ను కూడా ఆదేశించిన న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.


More Telugu News