జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కళ్లు తిరుగుతాయి: రఘునందన్ రావు

  • జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది
  • ఎంఐఎంను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు
  • ప్రతి ఎన్నికలో బీజేపీ గెలిచేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తా
తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఎన్నికలు వేడి పుట్టించాయి. ఇప్పుడు అందరి దృష్టి జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ వద్ద ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎంను కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. పాతబస్తీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను వెలికి తీస్తామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కళ్లు తిరుగుతాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నానని తెలిపారు.

వరద సాయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోణంలో వాడుకుందని, సాయాన్ని ఓట్ల కోనుగోలు ప్రక్రియగా మార్చిందని రఘునందన్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించవచ్చనే ఆత్మవిశ్వాసాన్ని దుబ్బాక ఇచ్చిందని చెప్పారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలకు మాత్రమే కేసీఆర్ సీఎం కాదని... అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేటతో సమానంగా కొట్లాడి దుబ్బాకకు నిధులను తీసుకెళ్తానని చెప్పారు. ప్రతి ఎన్నికలో బీజేపీ గెలిచేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తానని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కోర్టులో స్వయంగా పోరాటం చేస్తానని చెప్పారు. దుబ్బాక బస్టాండ్ నిధులను గోల్ మాల్ చేసిన వ్యవహారం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు.


More Telugu News