కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన నెదర్లాండ్స్ క్రికెటర్

  • కరోనా దెబ్బకు నిలిచిపోయిన క్రికెట్ కార్యకలాపాలు
  • వాయిదా పడిన టీ20 వరల్డ్ కప్
  • ఇళ్లకే పరిమితమైన నెదర్లాండ్స్ జాతీయ జట్టు క్రికెటర్లు
  • ఉపాధి కోసం ఊబర్ ఈట్స్ ఉద్యోగంలో చేరిన మీకెరెన్
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్రికెటర్లు విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. జాతీయ జట్టుకు ఆడితే వచ్చే ఆదాయంతో పాటు ఐపీఎల్ వంటి లీగ్ లు, వాణిజ్య ప్రకటనలు, ఇతర ఒప్పందాలతో కోట్లు సంపాదిస్తుంటారు. అయితే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో మాత్రం క్రికెటర్ల పరిస్థితి అంతంతమాత్రం అని చెప్పాలి. అందుకు ఉదాహరణ పాల్ వాన్ మీకెరెన్. డచ్ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగిన మీకెరెన్ ప్రస్తుతం ఉపాధి కోసం ఊబర్ ఈట్స్ డెలివరీ బాయ్ గా మారాడు.

గత కొంతకాలంగా మీకెరెన్ నెదర్లాండ్స్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టీ20 ఫార్మాట్లో 47 వికెట్లు తీశాడు. కరోనా కారణంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు మ్యాచ్ లు లేక ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో కుటుంబ పోషణ కోసం మీకెరెన్ ఉద్యోగంలో చేరక తప్పలేదు.

ఈఎస్పీఎన్ క్రికిన్ఫో సంస్థ చేసిన ఓ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మీకెరెన్ తన పరిస్థితిని వెల్లడించాడు. సరిగ్గా ఈ రోజున మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో టీ20 పురుషుల వరల్డ్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉంది అని క్రికిన్ఫో పేర్కొనగా, "నిజమే, ఈ సీజన్ లో నేను కూడా క్రికెట్ ఆడాల్సిన వాడిని. కానీ ఊబర్ ఈట్స్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాను" అని మీకెరెన్ స్పందించాడు. "ఈ శీతాకాలంలో కుటుంబం గడవాలి కదా, పరిస్థితులు ఎలా మారిపోతాయో తలుచుకుంటే తమాషాగా అనిపిస్తోంది. ఉల్లాసంగా గడపండి మిత్రులారా" అంటూ ఈ నెదర్లాండ్స్ బౌలర్ ట్వీట్ చేశాడు.

కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కు నెదర్లాండ్స్ జట్టు కూడా క్వాలిఫై అయింది. ఈ జట్టు గ్రూప్-బిలో ఉంది.  అయితే ఈ టోర్నీని ఐసీసీ రీషెడ్యూల్ చేసింది.


More Telugu News