టీఎస్‌బీపాస్‌ను ప్రారంభించిన కేటీఆర్.. ఎన్నో ప్రయోజనాలని వివరణ

  • రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే
  • పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం
  • పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకున్నాం
  • ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది
టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో నేటి నుంచి ఈ వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. దరఖాస్తుదారు  భవన నిర్మాణాలకు అనుమతులను దీని ద్వారా నిర్దేశించిన గడువులోగా ఇస్తారు.

75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. అలాగే, 600 గజాల లోపు ఇళ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకునే అనుమతి ఉంటుంది.  ఈ భవనాల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు వచ్చేస్తాయి. ఈ వెబ్‌సైట్‌ ను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు సులభతరం కానున్నాయి.  
 
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...  రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని తెలిపారు. పట్టణాల్లో మౌలిక వసతులపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని తెలిపారు. టీఎస్‌బీపాస్ ద్వారా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తాయని చెప్పారు.

ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. రాబోయే రెండు, మూడు నెలల్లో జీహెచ్‌ఎంసీ సవరణ చట్టాలను అమల్లోకి తీసుకొస్తామన్నారు. 1916 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. చెరువుల్లో, నాలాల మీద ఎక్కడపడితే అక్కడ నిర్మాణాలు చేపట్టడం వల్ల వరదలు రావడం, నీరు నిల్వ ఉండడం వంటివి చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. నూతన జీహెచ్‌ఎంసీ చట్టం ద్వారా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అటువంటి నిర్మాణాలు కూల్చేయొచ్చని తెలిపారు.


More Telugu News