బంగారం కొనేవారేరి?... దాదాపు సగానికి పడిపోయిన దిగుమతులు!

  • లాక్ డౌన్ సమయంలో షాపుల మూత, శుభకార్యాల వాయిదా
  • 47.42 శాతం తగ్గిన దిగుమతులు
  • ఏప్రిల్ - అక్టోబర్ గణాంకాలు విడుదల చేసిన వాణిజ్య శాఖ
ఇండియాలో కరోనా, లాక్ డౌన్ కారణంగా బంగారానికి డిమాండ్ గణనీయంగా తగ్గింది. బంగారం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే, ఎంతో తగ్గగా, ఆ మేరకు దిగుమతులు సైతం దాదాపు సగం తగ్గాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు 2019తో పోలిస్తే 47.42 శాతం తగ్గి 9.28 బిలియన్ డాలర్లకు చేరాయి.

2019లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 17.64 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఇంపోర్ట్ నమోదైంది. కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ భారీగా తగ్గిన దిగుమతులు, అక్టోబర్ లో మాత్రం 36 శాతం పుంజుకున్నాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు 64.65 శాతం తగ్గి 742 మిలియన్ డాలర్లకు చేరాయని గణాంకాలు వెల్లడించాయి.

ఇక తగ్గిన బంగారం దిగుమతులు, ఈ సంవత్సరం వాణిజ్య లోటును కనిష్ఠానికి చేర్చాయని కూడా వాణిజ్య శాఖ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 100.67 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, ఈ సంవత్సరం 32.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా ఉన్న ఇండియాలో, లాక్ డౌన్ కారణంగా దుకాణాలు మూతపడటం, వివాహాది శుభకార్యాలు వాయిదా పడటంతో బంగారం కొనుగోళ్లు పడిపోయాయి.

ఇండియాకు ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి అవుతూ ఉంటుంది. ఇక విలువైన రాళ్లు, ఆభరణాల దిగుమతులు సైతం 49.5 శాతం పడిపోయి 11.61 బిలియన్ డాలర్లకు చేరాయని వాణిజ్య శాఖ తన రిపోర్టులో వెల్లడించింది.


More Telugu News