పరిస్థితి దారుణంగా ఉంది.. ఆ కాలనీలు ఇంకా వరదనీటిలోనే వున్నాయి: కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ

  • మహేశ్వరం నియోజకవర్గంలో చాలా కాలనీలు ఇంకా వరదనీటిలోనే
  • అధికారులను అడిగితే నిధులు లేవంటున్నారు
  • బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, రెండు నెలలుగా వెయ్యి ఇళ్లు వరదనీటిలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మాన్ నగర్, సయీఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసులు బురద నీటి కారణంగా పలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకకు ఇప్పటి వరకు అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ రాలేదని అన్నారు.


అధికారులు, కలెక్టర్‌ను అడిగితే నిధులు లేవని, రాగానే పనులు చేస్తామని, ప్రభుత్వానికి నివేదికలు పంపామని చెబుతున్నారని లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి నియోజకవర్గంలో రెండు నెలలుగా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేపట్టాలని కోరారు. నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో కోరారు.


More Telugu News