టీమిండియా సెలక్టర్ల రేసులో అగార్కర్

  • సీనియర్ సెలెక్షన్ కమిటీలో మూడు స్థానాలు ఖాళీ
  • దరఖాస్తులు కోరిన బీసీసీఐ
  • దరఖాస్తు చేసుకున్న అగార్కర్, మణీందర్, చేతన్ శర్మ, దాస్
భారత క్రికెట్ సీనియర్ సెలెక్షన్ కమిటీ కోసం బీసీసీఐ ఇటీవల దరఖాస్తులు కోరిన సంగతి తెలిసిందే. టీమిండియా సెలెక్టర్లుగా శరణ్ దీప్ సింగ్, జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీల పదవీకాలం ఇటీవలే ముగిసింది. దాంతో వారి స్థానంలో కొత్త సెలెక్టర్లను తీసుకోనున్నారు. ఈ మూడు పోస్టుల కోసం టీమిండియా మాజీ ఆటగాళ్లు అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్, చేతన్ శర్మ, శివసుందర్ దాస్ లు రేసులో ఉన్నారు. నూతన సెలెక్టర్ల నియామకం కోసం దరఖాస్తుల గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా వీరు తమ దరఖాస్తులు అందజేశారు.

కాగా, బీసీసీఐ ఎప్పటినుంచో సెలెక్టర్ల ఎంపికలో జోనల్ విధానం పాటిస్తోంది. సౌత్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిపిన నియామకాల్లోనూ ఇదే విధానం ప్రకారం సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ లను ఎంపిక చేసింది. అయితే, బీసీసీఐ నూతన రాజ్యాంగంలో జోనల్ విధానంపై నిర్దిష్టంగా పేర్కొనకపోయినా, ఐదుగురు అత్యుత్తమ కాండిడేట్లను సెలెక్టర్లుగా నియమించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాల్సి వుంది.


More Telugu News