ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్: సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం
  • వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ను సీఎస్ ప్రారంభిస్తారన్న కేసీఆర్
  • స్పందన అద్భుతంగా ఉందని వెల్లడి
నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో తన కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ధరణి యాప్ తీసుకువచ్చిన సర్కారు పోర్టల్ ను కూడా షురూ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభమైందని, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ను రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇవాళ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. సర్కారు ప్రయత్నాలకు అద్భుతమైన ప్రతిస్పందన వస్తోందని, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని వివరించారు. ధరణి వేదిక ద్వారా తమ వ్యవసాయ భూములకు భరోసా దొరికిందన్న సంతృప్తిని, నిశ్చింతను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న ఫీడ్ బ్యాక్ అమోఘం అని వెల్లడించారు.

ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించి విజయవంతంగా ముందుకు సాగుతోందని, మరో మూడ్నాలుగు రోజుల్లో వంద శాతం సమస్యలను అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమస్యలన్నీ చక్కబడ్డాకే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలనుకున్నామని, అందుకే కొన్నిరోజులు వేచిచూశామని సీఎం కేసీఆర్ చెప్పారు.


More Telugu News