ఉత్తర కొరియా హోటల్లో మిస్టరీగా మారిన ఐదో అంతస్తు!

  • రాజధాని ప్యాంగాంగ్ లో భారీ హోటల్
  • ఐదో అంతస్తులోకి ఎవరినీ అనుమతించని వైనం
  • ఐదో అంతస్తులోకి వెళ్లిన అమెరికా టూరిస్టుకు జైలు శిక్ష
  • అనూహ్యంగా కోమాలోకి వెళ్లిన అమెరికా జాతీయుడు
కిమ్ జాంగ్ ఉన్ పాలనలోని ఉత్తర కొరియాలో ఆంక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటి ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువగా కలిగివుండే ఈ ఆసియా దేశంలో అసలేం జరుగుతోందో ఇతర దేశాలకు కూడా తెలియదు. అక్కడి అధికార మీడియాలో ఏం చెబితే అదే వార్త. కిమ్ జాంగ్ ఉన్ వ్యవహార శైలి తెలిసిన వాళ్లు ఇదేంటని ప్రశ్నించే సాహసం చేయరు. ప్రశ్నించినవాళ్లకు, తనకు నచ్చనివాళ్లకు ఏ గతి పట్టిందో గతంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి.

అయితే, ఉత్తర కొరియాలోని ఓ హోటల్ ఐదో అంతస్తులోకి ఎవరినీ, ఎందుకు అనుమతించరో ఓ మిస్టరీగా మారింది. ఆ మిస్టరీ తెలుసుకోవాలని వెళ్లిన వాళ్లు కూడా ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ సమీపంలోని టాయిడాంగ్ నదిలో కొన్ని చిన్న లంకలు (దీవులు) ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఓ చిన్న లంకలో యాంగ్ కాక్డో అనే హోటల్ ఉంది. ఉత్తర కొరియాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో ఈ హోటల్ భవనం కూడా ఒకటి.

కాగా, ఈ హోటల్ లోని ఐదో అంతస్తులోకి ప్రవేశం నిషిద్ధం. ఈ హోటల్ లో 47 అంతస్తులు ఉంటే ఆ ఒక్క అంతస్తులో అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియదు, తెలియనివ్వరు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఆ హోటల్ లోని లిఫ్టులో అన్ని అంతస్తులకు వెళ్లేందుకు బటన్లు ఉంటాయి కానీ, ఐదో అంతస్తుకు వెళ్లేందుకు మాత్రం బటన్ ఉండదు. అసలు, ఆ అంతస్తులో లిఫ్టు ఆగదు.

ఇక, కొందరు ఉత్సాహవంతులైన పర్యాటకులు సాహసం చేసి ఆ ఐదో అంతస్తులోకి వెళ్లి ఫొటోలు తీసుకుని వచ్చారట. వారు చెప్పిన వివరాలు చూస్తే.... ఐదో అంతస్తు రెండు భాగాలుగా ఉందని, అందులో ఎక్కువ గదులకు తాళాలు వేసి ఉన్నాయని, అక్కడి గోడలపై అమెరికా, జపాన్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు రాసివున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ అంతస్తులోకి ఎవరినీ అనుమతించకపోవడంతో బయటి ప్రపంచానికి తెలియకుండా అక్కడేదో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదేళ్ల కిందట  అమెరికాకు చెందిన ఓ పర్యాటకుడు యాంగ్ కాక్డో హోటల్ కు వెళ్లి ఐదో అంతస్తును సందర్శించాడు. ఈ సందర్భంగా ఐదో అంతస్తులో ఓ బ్యానర్ ను తొలగించే ప్రయత్నంగా హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడికి జైలు శిక్ష పడింది. జైల్లో ఉండగానే అతడు ఆరోగ్యం క్షీణించడంతో కోమాలోకి వెళ్లాడు. దాంతో జైలు అధికారులు విడుదల చేయగా, అతడిని అమెరికా తరలించారు. కానీ, కొన్నిరోజులకే ఆ పర్యాటకుడు మరణించాడు. అతడి మరణం కూడా ఓ మిస్టరీగా మారింది. మొత్తానికి యాంగ్ కాక్డో హోటల్ ఐదో అంతస్తు ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలిపోయింది.


More Telugu News