కొడుకు ఆన్ లైన్ క్లాసుల కోసం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని రోజంతా పోలీస్ స్టేషన్ లో గడిపిన మహిళ

  • ముంబయిలో ఘటన
  • అది చోరీకి గురైన ఫోన్ అంటూ యువతిని పీఎస్ కు తీసుకెళ్లిన పోలీసులు
  • ఆమెకేమీ తెలియదని ఇంటికి పంపించేసిన వైనం
  • విషయం తెలుసుకుని కొత్త ఫోన్ బహూకరించిన పోలీసు ఉన్నతాధికారులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల చదువు ఆన్ లైన్ బాటపట్టింది. అయితే తన కొడుకు ఆన్ లైన్ క్లాసుల్లో పాఠాలు వినేందుకు ఓ తల్లి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడింది. పాపం, ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో గడపాల్సి వచ్చింది. ముంబయిలోని బొరివిలీ ప్రాంతానికి చెందిన స్వాతి సావ్రే అనే మహిళ తన కొడుకు ఆన్ లైన్ క్లాసులకు ఉపయోగపడుతుందని ఒక సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసింది. దాని ఖరీదు రూ.6 వేలు కాగా, మరో రూ.1500 ఖర్చు చేసి చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించింది. మూడ్నెల్ల పాటు కష్టపడి పనిచేసి ఆ సొమ్ము కూడబెట్టింది.

ఇక, స్వాతి ఆ ఫోన్ లో సిమ్ వేసుకుని వాడడం ప్రారంభించిందో లేదో, పోలీసులు ఆమె ఇంటికి వచ్చారు. అది చోరీకి గురైన ఫోన్ అంటూ ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఒకరోజంతా ఆమెను స్టేషన్ లోనే ఉంచి అన్నివిధాలుగా ప్రశ్నించారు. చివరికి ఆ ఫోన్ చోరీతో ఆమెకు సంబంధం లేదని ఇంటికి పంపించేశారు. ఈ విషయాన్ని స్వాతి తాను పనిచేసే ఇంటి యజమానికి చెప్పడంతో ఆయన ఈ వ్యవహారాన్ని ట్విట్టర్ ద్వారా ముంబయి పోలీసులకు తెలియజేశారు.

దాంతో వెంటనే స్పందించిన ముంబయి పోలీసు అధికారులు ఓ కొత్త సెల్ ఫోన్ ను స్వాతికి అందించారు. ఆమె కొడుకు చదువుల కోసం ఆ ఫోన్ ఉపయోగించుకోవాలంటూ చెప్పారు. కొత్త ఫోన్ రావడంతో స్వాతి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. తన పరిస్థితిని గమనించి సాయం చేసిన ముంబయి పోలీసు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.


More Telugu News