ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

  • పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వం
  • కాలువల ఆధునికీకరణ,  విస్తరణను అడ్డుకోండి
  • తుంగభద్ర నీరు శ్రీశైలానికి రాకుండా అడ్డుకుంటోంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కాలువలను ఆధునికీకరించడంతోపాటు నీటి నిల్వను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని అందులో కోరారు.

ఎటువంటి ఆమోదం లేకుండానే పోతిరెడ్డిపాడు నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా తీసుకునేందుకు ఎస్కేప్ చానల్, నిప్పుల వాగు, గాలేరు, కుందూనది విస్తరణ పనులు చేపట్టిందని, ఇందుకు సంబంధించి చేపట్టిన ఉత్తర్వులపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది ఆగస్టులోనే లేఖ రాసినట్టు గుర్తు చేసిన ఆయన.. మళ్లీ ఇప్పుడు కొత్త పనులు చేపట్టిందని ఆరోపించారు.

అలాగే, గుంటూరు జిల్లా దుర్గి వద్ద నాగార్జున సాగర్ కుడికాలువపై బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.463 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచాలని చూస్తున్నారని, తుంగభద్ర నీరు శ్రీశైలానికి రాకుండా  కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది కుడివైపున గుండ్రేవుల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇవన్నీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నవే కాబట్టి వాటిని అడ్డుకోవాలని మురళీధర్ తన లేఖలో కోరారు.


More Telugu News