కరోనా సెకండ్ వేవ్ భయాలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం!

  • జనవరి-ఫిబ్రవరిలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం
  • ఇప్పటికే పలు దేశాల్లో సెకండ్ వేవ్
  • టెస్టింగ్ ల్యాబ్ లను  సిద్ధం చేయాలని ఆదేశించిన మహా ప్రభుత్వం
ఇప్పుడిప్పుడే కరోనా భయాల నుంచి దేశ ప్రజానీకం కోలుకుంటోంది. అయితే వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలతో జనాల్లో, ప్రభుత్వాల్లో ఆందోళన నెలకొంది. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందనే హెచ్చరికలు భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ టెస్టులకు సంబంధించి అన్ని జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

ఈనెల 11న మహారాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలోనే సెకండ్ వేవ్ మన దగ్గర కూడా రానుందనే అంచనాలు ఉన్నాయని తెలిపింది. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రారంభమైందని చెప్పింది. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చోట్ల కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా నేపథ్యంలో బాణసంచా లేని దీపావళిని జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. బాణసంచా కాలుష్యం వల్ల కరోనా పేషెంట్లకు శ్వాస సమస్యలు తలెత్తుతాయని తెలిపింది.


More Telugu News