ప్రయాణికులు లేక.. 12 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

  • పండుగ రద్దీని తట్టుకునేందుకు ఇటీవల ప్రత్యేక రైళ్లు ప్రకటన
  • వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణానికే ప్రజల మొగ్గు
  • రైళ్లు బోసిపోతుండడంతో సర్వీసుల నిలిపివేత
కరోనా నుంచి దేశం కోలుకుంటుండడంతో భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణికులను అనుమతిస్తోంది. పండుగ సీజన్ సందర్భంగా రద్దీని తట్టుకునేందుకు ఇటీవల పలు ప్రత్యేక రైళ్లను కూడా ప్రవేశపెట్టింది.

అయితే, రైలు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ లభించడం లేదు. కరోనా భయంతో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కొన్ని రైళ్లు ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. రైళ్లను ఖాళీగా నడపాల్సి వస్తుండడంతో స్పందించిన దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 12 సర్వీసులను రద్దు చేసింది.

దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైలు సర్వీసుల్లో.. విశాఖపట్నం- విజయవాడ- విశాఖపట్నం, నాందేడ్- పాన్వెల్- నాందేడ్,  ధర్మాబాద్‌- మన్మాడ్- ధర్మాబాద్, తిరుపతి- కొల్హాపూర్- తిరుపతి, కాచిగూడ- నార్కేర్- కాచిగూడ, కాచిగూడ- అకోలా-కాచిగూడ రైళ్లు ఉన్నాయి.


More Telugu News