త్వరలోనే ఐపీఎల్ వేలం.. రంగంలోకి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్

  • వచ్చే ఏడాది సీజన్ కోసం రెడీ అవుతున్న బీసీసీఐ
  • అహ్మదాబాద్ కేంద్రంగా కొత్త ఫ్రాంచైజీ
  • బైజూస్‌తో కలిసి బిడ్ వేయనున్న మోహన్‌లాల్!
ఐపీఎల్ 2020 ఇలా ముగిసిందో, లేదో.. 2021 సీజన్ కోసం బీసీసీఐ రెడీ అయిపోతోంది. కరోనా కారణంగా ఈ ఏడాది సీజన్ షెడ్యూలు కంటే చాలా ఆలస్యంగా జరిగినప్పటికీ, వచ్చే సీజన్‌ను మాత్రం షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. సౌరవ్ గంగూలీ ఇటీవల ఈ విషయాన్ని చూచాయగా చెప్పాడు కూడా.

దీంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిన బోర్డు.. ఐపీఎల్ వేలం కోసం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా వేలానికి సిద్ధంగా ఉండాలని, ఈసారి తొమ్మిదో ఫ్రాంచైజీ కూడా వేలంలో పాల్గొనబోతున్నట్టు ఫ్రాంచైజీలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. జనవరి, లేదంటే ఫిబ్రవరిలో వేలం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఓ ఫ్రాంచైజీ అధికారి ధ్రువీకరించారు. మరో కొత్త ఫ్రాంచైజీ వస్తున్న నేపథ్యంలో వేలాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేడయం కంటే ఇప్పుడు నిర్వహించడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

అహ్మదాబాద్‌ కేంద్రంగా ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థ ఒకటి ముందుకొచ్చిందని తెలుస్తోంది. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా ఫ్రాంచైజీ కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నారని, బైజూస్‌తో కలిసి బిడ్ వేసేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కనుక వస్తే ఇటీవల ప్రారంభించిన సర్దార్ పటేల్ స్టేడియం దానికి సొంత మైదానం కానుంది. కొత్త ఫ్రాంచైజీ వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్త ఫ్రాంచైజీ వస్తున్నప్పటికీ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండాలని ఓ ఫ్రాంచైజీ పేర్కొంది. ఆటగాళ్లందరినీ వేలానికి ఉంచడం సరికాదని చెబుతున్నారు.


More Telugu News