తెలంగాణ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. రేవంత్, వీహెచ్ మధ్య మాటల యుద్ధం
- భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ‘రైతు పొలికేక’
- బడుగు, బలహీన వర్గాలకే టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్న వీహెచ్
- డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం ఇక ఉండబోదన్న రేవంత్
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన ‘రైతు పొలికేక’ సభలో విభేదాలు పొడసూపాయి. సభలో వీహెచ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. దీంతో సభలోని కొందరు రేవంత్‌కు మద్దతుగా అనుకూల నినాదాలు చేశారు. వాటిని ఏమాత్రం పట్టించుకోని వీహెచ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుని టికెట్ ఇవ్వడం సరికాదని, పార్టీని నమ్ముకుని ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని అన్నారు.
అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వీహెచ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అమ్ముడుపోయే నేతలు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి ఏరివేయాలని అన్నారు. అంతటితో ఆగక పార్టీలో డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం కొనసాగుతోందని, ఇకపై అలా జరగబోదని అధిష్ఠానం కూడా తేల్చి చెప్పిందని వీహెచ్‌ను ఉద్దేశించి అన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదని, ఎక్కడి నుంచి వచ్చినా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులనే ప్రజలు గెలిపిస్తారని రేవంత్ అన్నారు. రేవంత్, వీహెచ్ వాగ్బాణాలతో సభలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.