వివేకా హత్య కేసులో అన్ని రికార్డులు సీబీఐకి అందజేయాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను ఆదేశించిన హైకోర్టు

  • వివేకా హత్యకేసులో కీలక పరిణామం
  • రికార్డులు అప్పగించేందుకు నిరాకరించిన పులివెందుల కోర్టు
  • హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ వర్గాలు
  • సీబీఐకి అనుకూలంగా హైకోర్టు తీర్పు
వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అంశంపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకేసు రికార్డులను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తన పిటిషన్ లో హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సీబీఐకి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలంటూ పులివెందుల మేజిస్ట్రేట్ ను హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో రికార్డులు అప్పగించేందుకు పులివెందుల కోర్టు నిరాకరించిన నేపథ్యంలోనే సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నవంబరు 2న పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించగా, సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించారు. కేసును రీ రిజిస్ట్రేషన్ చేసిన సీబీఐ తనదైనశైలిలో దర్యాప్తు షురూ చేసింది. సీబీఐ నుంచి ఓ బృందం ఇప్పటికే ఓసారి కడప వచ్చి కేసు పూర్వాపరాలు పరిశీలించింది. వివేకా ఇంటిని, పరిసరాలను నిశితంగా శోధించింది.


More Telugu News