ఇక మ్యాక్స్ వెల్, కాట్రెల్ మనకొద్దు... వదిలించుకునేందుకు సిద్ధమైన పంజాబ్!

  • కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లపై అసంతృప్తి
  • సరిగ్గా రాణించని మ్యాక్స్ వెల్, కాట్రెల్
  • వచ్చే సీజన్ లో వద్దనుకుంటున్న యాజమాన్యం
మ్యాక్స్ వెల్, కాట్రెల్... ఈ సీజన్ ఐపీఎల్ చూసిన వారందరికీ వీరిద్దరి పేర్లూ సుపరిచితమే. తాను బౌలింగ్ చేసి, ఎప్పుడు వికెట్ ను తీసినా, తనదైన శైలిలో మిలటరీ మార్చ్ చేస్తూ, సెల్యూట్ కొట్టే కాట్రెల్ ను ఐపీఎల్ అభిమానులెవరూ మరచిపోలేరు. అలానే మ్యాక్స్ వెల్ కూడా. మేటి ఆటగాడిగా ప్రత్యర్థుల బౌలర్లను గడగడలాడిస్తాడు. ఈ సీజన్ లో వీరిద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడారు. వీరిద్దరినీ సొంతం చేసుకునేందుకు, ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పంజాబ్ ఫ్రాంచైజీ మిగతా టీమ్ ల యాజమాన్యాలతో ఎంతో పోటీ పడింది. మ్యాక్స్ వెల్ ను రూ. 10.75 కోట్లు, కాట్రెల్ ను రూ. 8.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

కట్ చేస్తే, వీరిద్దరి ప్రదర్శన ప్రస్తుత సీజన్ లో అంతంతమాత్రమే. ఇద్దరూ పెద్దగా రాణించి, మ్యాచ్ ని ఒంటిచేత్తో గెలిపించిన దాఖలాలు లేవు. దీంతో ఇద్దరినీ వచ్చే సంవత్సరం వదిలించుకోవాలని పంజాబ్ జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ్యాక్స్ వెల్ తాను ఆడిన 13 మ్యాచ్ లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేయడంతో పంజాబ్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తిగా ఉందట.

ఇక 14 మ్యాచ్ లు ఆడి 55.83 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్న కేఎల్ రాహుల్ తో పాటు కోచ్ కుంబ్లే పనితీరుపైనా నమ్మకాన్ని ఉంచుకున్న కేఎక్స్ ఐపీ, వారిద్దరినీ తమ టీమ్ తోనే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇక, ఈ సీజన్ లో రాణించిన మయాంక్ అగర్వాల్, మహమ్మద్ షమీ, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ లను కూడా పంజాబ్ యాజమాన్యం వచ్చే సంవత్సరం కొనసాగించే వీలుందని తెలుస్తోంది.


More Telugu News