అమెరికా తిరిగి గేమ్ లోకి వచ్చింది... ఇక ఒంటరి కాదు: శత్రు దేశాలకు బైడెన్ హెచ్చరికలు

  • బైడెన్ కు ఫోన్ చేసిన యూరప్ దేశాల నేతలు
  • కరోనా, వాతావరణ మార్పులపై కలిసి పనిచేద్దాం
  • మేక్రాన్, జాన్సన్, మెర్కెల్ లతో బైడెన్
  • అధికార బదలాయింపునకు సిద్ధంగా లేని ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ శత్రుదేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తిరిగి గేమ్ లోకి వచ్చిందని, ఇక తన దేశం ఒంటరిది కాదని అన్నారు. అమెరికాతో స్నేహంగా ఉన్న పలు దేశాల అధినేతలు బైడెన్ కు ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో పాటు, ఇకపై కలిసి పని చేద్దామని తమ అభిలాషను తెలియపరిచిన వేళ, బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మేక్రాన్, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తదితరులు మంగళవారం నాడు బైడెన్ కు ఫోన్ చేసి, శుభాభినందనలు తెలిపారు. ఆపై ఇదే విషయాన్ని డెలావర్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన బైడెన్, "మీకు నేను ఒకటే చెప్పదలచుకున్నాను. అమెరికా తిరిగి గేమ్ లోకి వచ్చింది. ఇప్పుడు మేము ఒంటరి కాదు" అని యూఎస్ ను వ్యతిరేకిస్తున్న దేశాలను హెచ్చరించారు.

కాగా, అమెరికాలో అధికార బదలాయింపునకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా లేరన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు అక్రమాలు చేశారన్నది ఆయన అభియోగం. ట్రంప్ ఏమనుకుంటున్నా, తన పనిని తాను చేసుకుపోతున్న బైడెన్, ఇప్పటికే కరోనా కట్టడికి ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. యూరప్ దేశాలతో కలిసి కరోనా, వాతావరణ మార్పులపై కలిసి పనిచేస్తామని తెలిపారు.

జర్మనీని మెర్కెల్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడిన బైడెన్, ఇకపై అమెరికా నాటో, ఈయూతో కలిసి పని చేస్తుందని అన్నారు. బోరిస్ జాన్సన్ తనతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడారని, తాము ఎన్నో విషయాలను చర్చించామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడడానికి కృషి చేస్తామని అన్నారు.

ఇదిలావుండగా, ట్రంప్ సర్కారులో విదేశాంగ మంత్రిగా ఉన్న మైక్ పాంపియో, అధికారం ఇంకా తమ చేతిలోనే ఉందని స్పష్టంగా చెప్పడం గమనార్హం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార మార్పిడి ఎంతవరకూ వచ్చిందన్న ప్రశ్నపై స్పందించేందుకు నిరాకరించారు. ట్రంప్ పరిపాలన కొనసాగుతుందని మాత్రమే ఆయన చెప్పడం గమనార్హం.


More Telugu News