నీకెందుకు ఇంటి స్థలం? అంటూ అందరి ముందు దూషించారు: దేవినేని ఉమ

  • తూర్పుగోదావరి జిల్లాలో మహిళా వలంటీరు ఆత్మహత్యాయత్నం
  • ఎమ్మెల్యే దూషించాడంటూ లేఖ
  • వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా
అందరి సమక్షంలో ఎమ్మెల్యే దూషించారంటూ ఓ మహిళ వలంటీరు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. రోడ్డు పక్కన పాకలో ఉంటున్న పేద మహిళ స్థలం కోసం దరఖాస్తు చేసుకుందని, కానీ, నీకెందుకు స్థలం? అంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధి దుర్భాషలాడారని ఉమా ఆరోపించారు.

 సెంటుపట్టా పథకం పేదల కోసం కాక మీ ప్రజాప్రతినిధుల దోపిడీ కోసమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై ఈ విధంగా వేధింపులకు దిగుతున్న మీ నేతలు, ప్రజాప్రతినిధులపై ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ సీఎం జగన్ ను ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన మహిళా వలంటీరు తనను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అందరి మధ్యలో దూషించాడని, అందుకే తాను పురుగుల మందు తాగానని లేఖలో పేర్కొంది. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా దేవినేని ఉమ తన ట్వీట్ లో పంచుకున్నారు.


More Telugu News