తేజస్వి వర్సెస్ నితీశ్.. బీహార్ పీఠంపై కూర్చునేదెవరు?.. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • తేజస్వి సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌దే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్
  • సోదరుడిని కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించిన తేజ్‌ప్రతాప్ యాదవ్ 
  • మధ్యప్రదేశ్ ప్రజల తీర్పుపైనా కొనసాగుతున్న ఉత్కంఠ
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. బీహార్ ఎన్నికలు ప్రధానంగా ఎన్డీయే, తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఐదు పార్టీల కూటమి మహాఘట్‌బంధన్ మధ్య జరిగాయి.

కాగా, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాఘట్‌బంధన్‌కే అనుకూలమని చెబుతున్నాయి. నితీశ్ కుమార్ దశాబ్దంన్నరగా బీహార్‌ను ఏలుతుండడంతో ఈసారి ప్రజలు యువకుడైన తేజస్వికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు అర్థమైంది. కరోనా నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  

బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కాగా, నిన్న తేజస్వి యాదవ్ పుట్టిన రోజు కావడం, అంతకుముందే మహాఘట్‌బంధన్‌దే విజయమని అంచనాలు వెలువడడంతో ఆ కూటమిలో జోష్ నెలకొంది. తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ అయితే.. తేజస్విని కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ సహా పలువురు తేజస్వికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలపైనా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆయనతోపాటే వెళ్లారు.

పర్యవసానంగా, ఏర్పడిన ఈ ఖాళీలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఖాళీ అయిన 3 నియోజకవర్గాలకు కలిపి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కనీసం 8 సీట్లు వస్తేనే బీజేపీ ప్రభుత్వం సేఫ్‌గా ఉంటుంది. ఆ మార్కు తగ్గితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. కాగా, ప్రస్తుతం నిర్వహించిన ఉప ఎన్నికల స్థానాల్లో 27 చోట్ల గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు.


More Telugu News