పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పిన ముఖ్యమంత్రి జగన్

  • 2022లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిస్తాం
  • 2022 ఖరీఫ్ సీజన్ కు నీటిని అందిస్తాం
  • నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోతను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, ప్రాజెక్టు పూర్తవడంపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయి. దీనికి తోడు అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికే అప్పజెపుతామంటూ బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు చెప్పడం అనుమానాలను మరింత పెంచింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. 2022లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిస్తామని చెప్పారు. 2022 ఖరీఫ్ సీజన్ కు పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని ఇస్తామని తెలిపారు. సోమశిల హైలెవెల్ లెఫ్ట్ కెనాల్ ఫేజ్2 పనుల పైలాన్ కు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరంపై క్లారిటీ ఇచ్చారు.

సోమశిల లెఫ్ట్ కెనాల్ ఫేజ్2 పనులను రూ. 648.93 కోట్లతో చేపట్టనున్నారు. ఈ కెనాల్ ద్వారా జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 46,453 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఫేజ్1ను కూడా కలిపితే దాదాపు 90 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, సాగు,తాగు నీరు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా నీరు అందిస్తామని తెలిపారు.


More Telugu News