అలాంటప్పుడే విజయాలను సాధించగలం: ముంబై జట్టుకు సచిన్ సలహా

  • జీవితంలో మాదిరే ఆటలో కూడా సవాళ్లు ఉంటాయి
  • ఆటగాళ్లంతా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది
  • జట్టు యాజమాన్యం ప్రతి ఆటగాడిని ప్రోత్సహిస్తుంది
ఐపీఎల్ 13వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. కరోనా కారణంగా యూఏఈలో జరుగుతున్నా... స్డేడియంలో ప్రేక్షకులు లేకుండా జరుగుతున్నా... ప్రేక్షకాదరణ విషయంలో ఈ మెగా టోర్నీ విజయవంతమైంది. రేపు జరగనున్న ఫైనల్ లో ముంబై, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. ఐదోసారి కప్పును సాధించాలని ముంబై జట్టు పట్టుదలగా ఉండగా... ఫైనల్ కు తొలిసారిగా చేరినా, కచ్చితంగా టైటిల్ ఎగరేసుకుపోవాలని ఢిల్లీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై జట్టుకు ఆ టీమ్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ వీడియో ద్వారా ఓ మెసేజ్ ఇచ్చాడు.

ముంబై జట్టు ఒక కుటుంబమని, కష్టసుఖాల్లో కూడా ఆటగాళ్లు అందరూ కలిసే ఉంటారని సచిన్ చెప్పాడు. జీవితంలో మాదిరే ఆటలో కూడా సవాళ్లు ఉంటాయని తెలిపాడు. టీ20 లీగ్ లో కీలక దశకు చేరుకున్న తర్వాత సవాళ్లు ఎక్కువవుతాయని...ఈ సమయంలో ఆటగాళ్లంతా కలిసి ఉండటం, సమష్టిగా రాణించడం చాలా అవసరమని... అలాంటప్పుడే విజయాలను సాధించగలమని చెప్పాడు.

ముంబై జట్టుకు ఆడేటప్పుడు ఎవరూ వ్యక్తిగతంగా ఒక్కరు కాదని సచిన్ అన్నాడు. జట్టు సహాయక సిబ్బంది, యాజమాన్యం టీమ్ లో ఉన్న ప్రతి ఆటగాడిని ప్రోత్సహిస్తుందని చెప్పాడు. జట్టు మొత్తం అద్భుతంగా రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.


More Telugu News