వీడియో సెల్ఫీ వెలుగులోకి రాగానే సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు: నంద్యాల ఘటనపై హోంమంత్రి వివరణ

  • నంద్యాలలో ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్య
  • సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారన్న సుచరిత
  • రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించినట్టు వెల్లడి
  • సీఐ, హెడ్ కానిస్టేబుల్ పై కేసులు నమోదు 
కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నంద్యాలలో అబ్దుల్ సలాం, నూర్జహాన్, సల్మా, దాదా ఖలందర్ లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, ఆ తర్వాత అబ్దుల్ సలాం వీడియో సెల్ఫీ వెలుగులోకి రావడంతో సీఎం జగన్ తీవ్రంగా స్పందించారని సుచరిత వెల్లడించారు.

పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అబ్దుల్ సలాం పేర్కొన్న నేపథ్యంలో సీఎం సీరియస్ అయ్యారని, వెంటనే విచారణకు ఆదేశించారని, డీజీపీని, ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారని వివరించారు. స్పెషల్ ఆఫీసర్లుగా ఐపీఎస్ అధికారులు శంఖబ్రత బాగ్చి, ఆరిఫ్ లను నియమించినట్టు తెలిపారు. పోలీసుల వేధింపులు నిజమేనని విచారణ కమిటీ నిర్ధారించిన పిమ్మట సీఐ సోమశేఖర్ రెడ్డిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లను అరెస్ట్ చేశామని, వారిపై ఐపీసీ 306, 322, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

అబ్దుల్ సలాం కుటుంబంలో మిగిలివున్న 65 ఏళ్ల వృద్ధురాలికి ప్రభుత్వం చేయూతగా నిలుస్తుందని అన్నారు. ఆ కుటుంబంపై ఆధారపడి ఉన్న ఆ వృద్ధురాలికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని వెల్లడించారు. ఏదేమైనా పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగే ఇలాంటి ఘటనల్లో ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని హోంమంమత్రి సుచరిత స్పష్టం చేశారు.

చీరాలో కిరణ్ ఉదంతం కానీ, సీతానగరం శిరోముండనం కేసులో కానివ్వండి, శ్రీకాకుళం సంఘటనలో కానీయండి.. శాఖాపరంగా స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక జరిగిన అనేక సంఘటనల్లో ఈ విధంగానే స్పందించామని, బాధ్యులపై కేసులు కూడా నమోదు చేశామని అన్నారు.


More Telugu News