అర్నాబ్ గోస్వామి వ్యవహారం.. మహారాష్ట్ర హోంమంత్రితో మాట్లాడిన గవర్నర్

  • అలీబాగ్ జైలు నుంచి తలోజా జైలుకు అర్నాబ్ తరలింపు
  • తన జీవితం ప్రమాదంలో ఉందన్న అర్నాబ్
  • తన లాయర్ తో కూడా మాట్లాడనీయడం లేదని మండిపాటు
ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారనే ఆరోపణలతో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జైల్లో తనను హింసకు గురి చేస్తున్నారని, తన కుటుంబ సభ్యులను కూడా కలవనీయడం లేదని అర్నాబ్ ఆరోపించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఈ అంశంపై స్పందించారు.

మహారాష్ట్ర హోంమంత్రితో ఈ ఉదయం కోశ్యారీ మాట్లాడారు. ఈ సందర్భంగా అర్నాబ్ గోస్వామి రక్షణ, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్నాబ్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోరారు.

అలీబాగ్ జైలు క్వారంటైన్ సెంటర్లో ఉన్న అర్నాబ్ మొబైల్ ఫోన్ వాడుతున్నారనే కారణాలతో ఆయనను అక్కడి నుంచి తలోజా జైలుకు శనివారం సాయంత్రం తరలించారు. పోలీసు వాహనంలో తరలిస్తుండగా అర్నాబ్ వాహనాన్ని చుట్టుముట్టిన మీడియాను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ... తన జీవితం ప్రమాదంలో ఉందని అన్నారు. తన లాయర్ తో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని చెప్పారు. జైలర్ తన పట్ల దారుణంగా ప్రవర్తించారని అన్నారు.


More Telugu News