'సమస్యలు సృష్టించే వారి కాళ్లు విరిగిపోతాయి'... బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యల కలకలం!

  • తృణమూల్ కార్యకర్తలకు దిలీప్ ఘోష్ వార్నింగ్
  • తలలు పగలొచ్చు, ఎముకలు విరగొచ్చు
  • శ్మశానానికి కూడా పోయే అవకాశాలు
  • హల్దియా ర్యాలీలో దిలీప్ ఘోష్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అనుచరులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మమత కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు టీవీ చానెళ్లలలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"దీదీ సోదరులకు ఇదే నా హెచ్చరిక. ఎవరైతే వచ్చే ఆరు నెలల్లో సమస్యలు సృష్టిస్తారో వారికి నా వార్నింగ్. వారి కాళ్లూ చేతులు, ఎముకలు విరిగిపోవచ్చు. తలలు పగలొచ్చు. వారు ఆసుపత్రుల్లో చేరవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటున్నారా? శ్మశానానికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి" అని హల్దియాలో జరిగిన ర్యాలీలో ఘోష్ కటువు వ్యాఖ్యలు చేశారు.

వచ్చే సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో బలపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగానే, ఎన్నికలకు మరింత సమయం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బలపడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే బీజేపీ, తృణమూల్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి, బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన రెండు రోజుల వ్యవధిలోనే దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, 200 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.


More Telugu News