ట్రంప్ కు పదవి పోయే... ఇప్పుడు మెలానియా కూడా...?

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి
  • విడాకులు ఇచ్చేందుకు మెలానియా సిద్ధమైందని కథనాలు
  • ట్రంప్ వైట్ హౌస్ ను వీడాక విడాకులు కోరనుందని ప్రచారం
హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అద్భుత విజయం అందుకోగా, తానే గెలుస్తానంటూ బీరాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ పరాజితుడిగా మిగిలిపోయారు. జనవరిలో బైడెన్ అమెరికా పాలనా పగ్గాలు చేపట్టగానే ట్రంప్ మాజీ అవుతారు. ఇప్పుడు ట్రంప్ ఓటమి కంటే మరో అంశం అమెరికాలో ఎక్కువగా చర్చకు వస్తోంది. వైట్ హౌస్ ను ఖాళీ చేసి ట్రంప్ బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకు విడాకులు ఇవ్వాలని మెలానియా ట్రంప్ భావిస్తోందట. అమెరికాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

సాక్షాత్తు ట్రంప్ మాజీ అనుయాయులు ఈ విషయం చెప్పినట్టు డెయిలీ మెయిల్ యూకే ఓ కథనంలో పేర్కొంది. మెలానియా ట్రంప్ కు సీనియర్ సలహాదారుగా వ్యవహరించిన స్టెఫానీ వోల్కోఫ్ ను ఉటంకిస్తూ... వైట్ హౌస్ లో ట్రంప్ దంపతులకు వేర్వేరుగా బెడ్రూములు ఉండేవని, అసలు వారిద్దరిదీ అంశాల ప్రాతిపదికన జరిగిన ఒప్పంద వివాహం అని ఆ కథనంలో వివరించారు.

ఇక, మరో మాజీ ఒమరోసా మానిగాల్ట్ చెప్పిన వివరాల ఆధారంగా.... పదిహేనేళ్లకు పైగా సాగిన డొనాల్డ్ ట్రంప్, మెలానియాల దాంపత్యం ఇక ముగిసిందని ఆ కథనంలో తెలిపారు. ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చేస్తాడా అని మెలానియా ఘడియలు లెక్కిస్తోందని, ట్రంప్ పదవి నుంచి తప్పుకున్న వెంటనే మెలానియా విడాకులు ఇస్తుందని వివరించారు.

మెలానియా వయసు 50 ఏళ్లు కాగా, ట్రంప్ వయసు 74 ఏళ్లు. వీరిద్దరి దాంపత్యం ఏమంత సజావుగా లేదంటూ మీడియాలో బహిర్గతమైన అనేక దృశ్యాలు చెబుతాయి. ట్రంప్ తో సఖ్యంగా ఉండేందుకు మెలానియా ఇష్టపడని అనేక ఘటనలు మీడియా కెమెరాల కంటికి చిక్కాయి. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎంతమేర వాస్తవం ఉందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!


More Telugu News