బద్వేలులో విషాదం... కరోనాపై ఒకసారి గెలిచినా, రెండోసారి ఓడి మృత్యువు ఒడిలోకి వెళ్లిన యువ డాక్టర్

  • ప్రభుత్వ వైద్యుడికి రెండుసార్లు సోకిన కరోనా
  • మొదటిసారి సోకినప్పుడు విజయవంతంగా కోలుకున్న వైనం
  • రెండోసారి కబళించిన కరోనా
కరోనా మహమ్మారి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పే ఘటన ఇది. ఒకసారి సోకిన వారికి మరోసారి వైరస్ సోకదని నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదని హెచ్చరించే ఉదంతం ఇది. బద్వేలులోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్ గా పనిచేస్తున్న నందకుమార్ కరోనాతో కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. నందకుమార్ వయసు 28 సంవత్సరాలు. ఆయన మూడు నెలల కిందట కరోనా బారినపడి కోలుకున్నారు. ఆపై తన విధులకు హాజరవుతున్నారు.

అయితే, ఇటీవలే మళ్లీ కరోనా సోకింది. రెండు వారాల కిందట జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఇంటివద్దే చికిత్స పొందారు. తగ్గకపోవడంతో కడప రిమ్స్ కు వెళ్లారు. అక్కడ్నించి తిరుపతి స్విమ్స్ కు, ఆపై చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ నందకుమార్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పనిచేసిన ఆసుపత్రిలో సిబ్బంది, బంధుమిత్రులు తీవ్ర విచారానికి లోనయ్యారు.


More Telugu News