అమెరికాలో చరిత్ర సృష్టించిన కమలా హారిస్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు!

  • కమలా హారిస్ కు భారత మూలాలు
  • 1964లో జన్మించిన కమల
  • ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన కమల
లక్షలాది మంది భారతీయుల కలలను నిజం చేస్తూ, భారత సంతతి మహిళ కమలా హారిస్ అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కమలా హారిస్ కు భారత మూలాలుండటం, ఆమె కన్నతల్లి తమిళనాడులోని ఓ గ్రామానికి చెందిన వారు కావడంతో ప్రస్తుతం ఆ గ్రామంలోని వారి ఆనందానికి అవధుల్లేవు. ఓ భారత సంతతి మూలాలున్న మహిళకు అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు దక్కనుండటం ఓ ఘనత కాగా, 2024లో జరిగే ఎన్నికల్లో ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారని తెలుస్తుండటం మరింత ఘనతేనని చెప్పవచ్చు.

ఇప్పటికే కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా, సెనెట్ సభ్యురాలిగా సేవలందించిన కమలా హారిస్ జీవిత చరిత్రను ఓ మారు పరిశీలిస్తే...

కమలాహారిస్ 1964, అక్టోబర్ 20న ఓక్లాండ్ లో జన్మించారు. ఆమె తల్లి తమిళనాడుకు చెందిన ఓ గ్రామానికి చెందిన యువతికాగా, తండ్రి జమైకా దేశస్తుడు. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఇక, కమలా హారిస్ వాషింగ్టన్ లోని హోవార్డ్ వర్శిటీలో, యూసీ హేస్టింగ్స్ కాలేజీలో విద్యను అభ్యసించారు. అటార్నీ జనరల్ గానూ పనిచేశారు.

ఆ సమయంలో చిన్నారులపై జరుగుతున్న హింసలకు సంబంధించిన ఎన్నో కేసులను తనదైన శైలిలో వాదించి, పేరు తెచ్చుకున్నారు. ఆపై కమలా హారిస్ ను గుర్తించిన బరాక్ ఒబామా ఆమెను ప్రోత్సహించడంతో డెమొక్రటిక్ పార్టీలో చేరి, కాలిఫోర్నియా సెనెటర్ గా ఎన్నికయ్యారు. ఆపై వరుస విజయాలతో ఇప్పుడు బైడెన్ కు నమ్మకమైన అనుచరురాలిగా, ఉపాధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమయ్యారు.



More Telugu News