మహిళల టీ20 చాలెంజ్.. ఫైన‌ల్‌లో హర్మన్ సేన

  • చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • విజయానికి రెండు పరుగుల ముందు మంధాన జట్టు బోల్తా
  • ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఫైనల్‌లోకి
షార్జా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 పోరులో హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టు స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్‌బ్లేజర్స్ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ట్రయల్ బ్లేజర్స్ జట్టు ఓటమి పాలైనప్పటికీ మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ జట్టు కంటే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు.. చమరి ఆటపట్టు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసి విజయానికి రెండు పరుగుల ముందు బోల్తాపడింది.

కెప్టెన్ స్మృతి మంధాన (33), దీప్తిశర్మ (43, నాటౌట్), దియేంద్ర డాటిన్ (27), హర్లీన్ డియోల్ (27) రాణించినప్పటికీ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి సూపర్‌నోవాస్‌నే విజయం వరించింది. ఆ జట్టు బౌలర్లలో రాధా యాదవ్, షకీర సెల్మాన్‌లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, అనూజ్ పాటిల్ ఓ వికెట్ పడగొట్టింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్‌నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రియా పూనియా 30, ఆటపట్టు 67, హర్మన్‌ప్రీత్ కౌర్ 31 పరుగులు చేశారు. ముఖ్యంగా ఆటపట్టు చెలరేగిపోయింది. క్రీజులో ఉన్నంత సేపు సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టింది. 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆటపట్టు 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసింది. నిజానికి జట్టు స్కోరు 160 దాటుతుందని భావించినా చివర్లో వరుస పెట్టి వికెట్లు కోల్పోవడంతో 146 పరుగులకు పరిమితమైంది.ట్రయల్‌బ్లేజర్స్ బౌలర్లలో గోస్వామి, సల్మా ఖాతూన్, హర్లీన్ డియోలో చెరో వికెట్ తీశారు. 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చమరి ఆటపట్టుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సూపర్‌నోవాస్, ట్రయల్‌బ్లేజర్స్ జట్ల మధ్య రేపు ఫైనల్ పోరు జరగనుంది.


More Telugu News