వివిధ రూట్లలో ఏపీ నుంచి తెలంగాణకు తిరిగే బస్సుల సంఖ్య!

  • ఒక్క హైదరాబాద్ కే 534 బస్సులు
  • విజయవాడ రూట్ లో భారీగా తగ్గిన బస్సులు
  • మొత్తం 371 సర్వీసులను తగ్గించుకున్న ఏపీ
నిత్యమూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు రూట్లను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఏపీ నుంచి రోజుకు ఒక్క హైదరాబాద్ కు 534 బస్సులు, ఇతర ప్రాంతాలకు 104 బస్సులను తిప్పేలా ప్రణాళికను విడుదల చేశారు. గతంలో విజయవాడ - హైదరాబాద్ రూట్ లో 264 బస్సులు నడువగా, ఇప్పుడు వాటిని 166కు కుదించారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ పలు రూట్లలో తన సర్వీసులను పెంచుకుంది.

రూట్ల వారీగా పరిశీలిస్తే, శ్రీకాకుళం, విజయనగరం రూట్లో గతంలో ఆరు బస్సులు తిరుగగా, నాలుగు తగ్గించి, ఇప్పుడు రెండు బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. విశాఖ రూట్లో 27 బస్సులు నడుస్తుండగా, 10 తగ్గించి, 17 బస్సులకు కుదించారు.

తూర్పు గోదావరి జిల్లా నుంచి గతంలో 130 బస్సులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 83కు తగ్గిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చే 97 బస్సులు 69కి తగ్గాయి. గుంటూరు రూట్ నుంచి గతంలో 101 బస్సులు రాగా, ఇప్పుడు వాటి సంఖ్య 61కి తగ్గింది. ఒంగోలు నుంచి వచ్చే 133 బస్సులను 88కి, నెల్లూరు రూట్ లో వచ్చే 27 బస్సులను 11కు, చిత్తూరు రూట్ లో తిరిగే 52 బస్సులను 30కి తగ్గిస్తున్నట్టు ఏపీ ప్రతిపాదించింది.

ఇక కర్నూలు రూట్ లో గతంలో 86 బస్సులు నడువగా, ఇప్పుడు వాటిని 54కు తగ్గించారు. అనంతపురం రూట్ లో గతంలో 41 బస్సులు తిరుగగా, ఇప్పుడు వాటిని 29కి తగ్గించారు. మొత్తం మీద లాక్ డౌన్ కు ముందు ఏపీ నుంచి తెలంగాణకు 1,009 సర్వీసులు నడుస్తుండగా, వాటిల్లో 371 సర్వీసులను కుదించి, ప్రస్తుతం 638 సర్వీసులను మాత్రమే నడిపించనున్నామని అధికారులు స్పష్టం చేశారు.



More Telugu News