కమలహాసన్ కొత్త సినిమా టైటిల్ 'విక్రమ్'!

  • 'కత్తి', 'మాస్టర్' చిత్రాల ఫేమ్ లోకేశ్ తో కమల్ 
  • మాస్ క్యారెక్టర్లో కనిపిస్తున్న కమల్
  • యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా నిర్మాణం  
కమలహాసన్ ఒక సినిమా చేస్తున్నాడంటే అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఓ ఉత్సుకత ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆయన చేసే సినిమాలో కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. అలాంటి కథలనే ఆయన ఎంచుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.

ఆమధ్య కార్తీతో 'కత్తి' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించి, విజయ్ తో 'మాస్టర్' (విడుదల కావాల్సివుంది) వంటి భారీ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేశ్ తో కమల్ సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'విక్రమ్' అనే టైటిల్ని నిర్ణయించారు.

ఈ రోజు కమల్ జన్మదినం సందర్భంగా ఈ టైటిల్ని ప్రకటించారు. అలాగే చిత్రం టీజర్ ని కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. టీజర్ ని బట్టి చూస్తే ఇందులో కమల్ మాస్ క్యారెక్టర్ని పోషించినట్టు, ఇది యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందుతున్నట్టు కనిపిస్తోంది. కమల్ సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలావుంచితే, మరోపక్క శంకర్ దర్శకత్వంలో కమల్ 'ఇండియన్ 2' చిత్రాన్ని కూడా చేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే, బడ్జెట్ విషయంలో దర్శకుడికి, నిర్మాతకు భేదాభిప్రాయాలు రావడం వల్ల ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ ఆగిందని అంటున్నారు.


More Telugu News